తెలంగాణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రయాణికులకు కీలక అలర్ట్. ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్ పాటించాలని సంబంధిత సంఘాలు నిర్ణయించినట్లు ప్రకటించాయి.
స్కూల్ బస్సుల డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని, ప్రతి స్కూల్ వాహనానికి ఒక అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మరోవైపు ఆటో, క్యాబ్ సంఘాలు కూడా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆటోలకు ఒకే పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సమస్యలపై రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందించి, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరనున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి బంద్ కొనసాగించే అవకాశం ఉందని సంఘాలు వెల్లడించాయి. దీంతో ఆగస్టు 24న స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సాధారణ ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉంది. :::